మే 8న “అనకాపల్లి” సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథ్ స్పష్టం చేశారు. స్థానిక సన్ క్యాస్ట్రాల్ హోటల్లో గురువారం నిర్వహించిన టీజర్ విజయోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం టీజర్‌కు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. అనకాపల్లి ప్రాంతంలోనే ఈ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు.
అనకాపల్లిపై ఉన్న అభిమానంతో ఈ ప్రాంతానికి చెందిన కాండ్రేగుల నాయుడు నిర్మాతగా సినిమాను తెరకెక్కించినట్లు ఆయన చెప్పారు. అనకాపల్లి ప్రసిద్ధి నూకాలమ్మ ఆలయంతో పాటు, బెల్లం వ్యాపారంలో దేశ రెండో స్థానం ఆక్రమించిన స్థాయిలో ఉందని, రాజకీయంగా కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తింపు పొందారని తెలిపారు. అలాంటి అనకాపల్లి పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 8వ తేదీన విడుదల కానుందని, దీని ద్వారా పట్టణానికి మరింత పేరు తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విక్రమ్ సహదేవ్ హీరోగా, సంధ్య వశిష్ట హీరోయిన్‌గా, తారక్ కొండప్ప విలన్‌గా అద్భుత నటన ప్రదర్శించారని నక్కిన త్రినాథ్ ప్రశంసించారు. తమ్మినేని కాగేష్ దర్శకత్వంలో చిత్రం అద్భుతంగా రూపొందిందని స్పష్టం చేశారు. అలాగే అనకాపల్లికి చెందిన కొడుకు శ్రీకాంత్ కథను రూపొందించినందున, ఈ చిత్రం ప్రత్యేకత పొందిందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మల్ల సురేంద్ర మాట్లాడుతూ, నక్కిన త్రినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు సాధించిన విజయాలను ప్రస్తావించి, “అనకాపల్లి” సినిమా కూడా ప్రజల హృదయాలను గెలుచుకుంటుందని అంచనా వేశారు. సహనిర్మాత కుమార్ రాజా, కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు పీవీ రమణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంకేతిక వర్గాన్ని సత్కరించిన సందర్భంగా, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తే మరిన్ని “అనకాపల్లి” సినిమాలు రూపొందేందుకు అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు.