📢 Advertisement Space

అమరావతితో అభివృద్ధి బాటలు- ఎంపీ సీఎం రమేష్

🗞️ బిబి న్యూస్ | 01 Apr 2026

రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ లోక్‌సభలో ఉద్వేగభరిత ప్రసంగంలో స్పష్టం చేశారు. విభజన తర్వాత హైదరాబాద్, చెన్నై వంటి ఆర్థిక కేంద్రాలు లేకపోవడం అభివృద్ధికి అడ్డంకిగా మారిందని, అమరావతి ద్వారానే సుస్థిర పురోగతి సాధ్యమని ఆయన పేర్కొన్నారు .ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు అమరావతేనని, అది ఆంధ్రుల గౌరవ ప్రతీకమని ఆయన ఘోషించారు.ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఈ చట్టానికి కీలక పాత్ర పోషించారని సి.ఎం. రమేష్ తెలిపారు. డబుల్ ఎంజిన్ సర్కార్ రెండు నెలల్లో 33 వేల ఎకరాల భూముల సమీకరణకు దోహదపడిందని ఆయన కొనియాడారు.ఈ బిల్లు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందని ఆయన అన్నారు.పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక మూడు ముక్కలాట ఆడలేరని, ఊసరవెల్లి రాజకీయాలు పనిచేయవని సి.ఎం. రమేష్ తీవ్రంగా విమర్శించారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం రాజధాని అంశంపై నాటకాలు ఆడి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిందని, అమరావతి రైతుల మహిళలపై అమానుషం చేసిందని ఆరోపించారు .అమరావతికి మద్దతు ఇవ్వని వారు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు .
రాష్ట్ర భవిష్యత్తు అమరావతి అభివృద్ధితో పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని సి.ఎం. రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.లోక్‌సభ ఆమోదం తర్వాత రాజ్యసభలో కూడా బిల్లు ప్రవేశపెట్టనున్నారు.ఈ చట్టం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు తిరిగినట్టు ఆయన పేర్కొన్నారు.