దీనదయాళ్ జయంతి సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, పండ్ల పంపిణీ
🗞️ బిబి న్యూస్ | 26 Sep 2026
అనకాపల్లి, సెప్టెంబర్ 25:
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక వృద్ధుల అనాథ శరణాలయంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. దుప్పట్లు, పండ్లను పలకా రవి సమకూర్చారు.జిల్లా ధార్మిక విభాగం కన్వీనర్ దాడి వీరునాయుడు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, నిరుపేదలకు అండగా నిలిచి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమానికి అవసరమైన దుప్పట్లు, పండ్లు సమకూర్చిన పలకా రవి సేవాభావాన్ని అభినందించారు.పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవవాదం, అంత్యోదయ సిద్ధాంతాలు సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని నాయకులు తెలిపారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ సిద్ధాంతం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ధార్మిక విభాగం కన్వీనర్ దాడి వీరునాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు వెంకటయాదవ్, అలమండ శీను, కాండ్రేగుల శ్రీనివాసరావు, మహిళా నాయకురాళ్లు భాను, నాగమణి తదితరులు పాల్గొన్నారు.