అనకాపల్లి, సెప్టెంబర్ 20: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హమారా ప్రసాద్ అలియాస్ నాగులరపు వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో ధర్నా నిర్వహించారు.అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అనకాపల్లి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ధర్నా జరిగింది. సోషల్ మీడియాలో అంబేడ్కర్‌ను అవమానించేలా అవాస్తవ ప్రచారం చేస్తున్నారని, అదే అంశాలతో పుస్తకాలను ప్రచురించినట్లు ఆరోపిస్తూ సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నాలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ప్రధాన వక్తగా దూలం బూసిరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను అవమానించే వ్యాఖ్యలు, ప్రచారాలను సహించబోమని అన్నారు. ప్రజల్లో అభద్రత, అశాంతి, అలజడి కలిగించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి చర్యలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో రెండు సంఘాల అధినేతలు, దళిత రక్షక అవార్డు గ్రహీత కోనపల్లి సత్యనారాయణ, దొడ్డి రమేష్, కాండ్రేగుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.ధర్నా సందర్భంగా “జై భీమ్.. జై భారత్” అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్ గౌరవాన్ని కాపాడాలని, రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని పాల్గొన్నవారు కోరారు.