7 రోజుల్లో న్యాయం జరగాలి...పోలీసు అధికారులకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు
🗞️ బిబి న్యూస్ | 22 Sep 2026
అనకాపల్లి, సెప్టెంబర్ 21:
బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసు వ్యవస్థ పనితీరుకు అసలైన కొలమానమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,ఐపీఎస్ స్పష్టం చేశారు.సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు.ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మొత్తం 75 ఫిర్యాదులను స్వీకరించారు.ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ తగాదాలు,ఆస్తి వివాదాలు,ఆర్థిక మోసాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు,గృహ వేధింపులు,శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు.ప్రతి ఫిర్యాదుపై గరిష్టంగా వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా వాస్తవాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు.కేసు ఏ దశలో ఉందో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని తెలిపారు.విచారణ పూర్తయిన వెంటనే తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు.మహిళల రక్షణ,భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు.మహిళలను, సామాన్య ప్రజలను మోసగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.బాధితులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు అండగా నిలిచేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, ఎస్సై శ్రీనివాసరావు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.