📢 Advertisement Space

అనకాపల్లి అభివృద్ధికి కొత్త దిశ...83వ వార్డులో రూ.5.50 కోట్లతో అభివృద్ధి పనులు

🗞️ బిబి న్యూస్ | 16 Sep 2026

అనకాపల్లి: అనకాపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా 83వ వార్డులో సుమారు రూ.5.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు 83వ వార్డు కూటమి నాయకులు తెలిపారు. రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ 83వ వార్డులో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ గుండాల జంక్షన్‌లో ఆర్‌ఓ కార్యాలయం వెనుక సుమారు రూ.2 కోట్లతో నిర్మించిన జీవీఎంసీ అతిథి గృహాన్ని ఎమ్మెల్యే పరిశీలించినట్లు తెలిపారు.అన్నపూర్ణ బ్యాంక్ రోడ్డులో సమస్యాత్మకంగా ఉన్న కల్వర్టు స్థానంలో సుమారు రూ.38 లక్షలతో కొత్త కల్వర్టు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. మిరియాల కాలనీ–లక్ష్మీదేవిపేట ప్రాంతాలను అనుసంధానించే ఎల్లయ్య కాలువపై నిర్మించిన ఐరన్ బ్రిడ్జిని కూడా ఎమ్మెల్యే పరిశీలించారు.ఏఎంసీ కాలనీలో సెప్టిక్ ట్యాంకులను ఖాళీ ప్రదేశానికి తరలించి, అక్కడ పిల్లల కోసం పార్కు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సుమారు రూ.40 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. మంచినీటి సమస్య పరిష్కారానికి పాత ట్యాంకు స్థానంలో కొత్త నీటి ట్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు, రైల్వే గేట్ పక్క నుంచి ఏఎంసీ కాలనీ మీదుగా చేపల బజారు రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు.అండర్ బ్రిడ్జి అవతలి ప్రాంతం, రజితల వారి వీధి, అయ్యప్పగుప్త హాస్పిటల్ రోడ్డు, మిరియాల కాలనీ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. వేల్పుల వీధిలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌ను సుమారు రూ.30 లక్షలతో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నాయకులు తెలిపారు. టౌన్ గర్ల్స్ హైస్కూల్ వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు ప్లే ఏరియాగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు.పట్టణ సుందరీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్–అంబేద్కర్ విగ్రహం జంక్షన్ వద్ద సుమారు రూ.35 లక్షలతో రైల్వే ఇంజన్ ఆకృతి ఏర్పాటు, గాంధీ బొమ్మ సెంటర్‌లో సుమారు రూ.10 లక్షలతో నూతన గాంధీ విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. సర్వదాంబ పార్కు అభివృద్ధికి రూ.20 లక్షలు, తాకాసి వీధిలో చిన్న నూకలమ్మ గుడి సమీపంలోని కమ్యూనిటీ హాల్ విస్తరణకు రూ.20 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.మల్లవరపు వారి వీధి, తాకాసి వీధి, వేల్పుల వీధి, కాశీ విశ్వేశ్వర స్వామి కోవెల రోడ్డు తదితర ప్రాంతాల్లో అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైప్‌లైన్లకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. లక్ష్మీపేటలో రైతులకు అవసరమైన రహదారి, పోస్టాఫీస్ నుంచి వేల్పుల వీధి కళ్యాణ మండపం వరకు కాలువల అభివృద్ధి, తాకాసి వీధి టర్నింగ్ వద్ద కాలువపై స్లాబ్ నిర్మాణం వంటి పనులపై కూడా దృష్టి సారించినట్లు చెప్పారు.అనకాపల్లి పట్టణాన్ని మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చేసే లక్ష్యంతో రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, మంచినీటి వసతులు, జంక్షన్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని 83వ వార్డు కూటమి నాయకులు తెలిపారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సమావేశంలో 83వ వార్డు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ మంగ ఈశ్వర్, టీడీపీ ఇన్‌చార్జ్ బొద్దపు ప్రసాద్, గొర్లి శేఖర్, వాకాడు బాబు, దొడ్డి రాము, సురభి హరీష్, షేక్ రియాజ్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.