అనకాపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రతి గడపలో ‘ఆశీర్వాద్ కా దీపం’ వెలిగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం దీపం వెలిగించి ఆశీర్వాదం అందించాలని ఆయన కోరారు. జాతీయ అధ్యక్షుడి పిలుపు మేరకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహించనున్నట్లు పీవీఎన్ మాధవ్ ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ దాడి వీరునాయుడు కోరారు.సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ప్రతి భారతీయుడు తన ఇంటి గడప వద్ద దీపం వెలిగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద వెలిగించే దీపం దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం, ‘వికసిత్ భారత్ @ 2047’ సంకల్పానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.