భారీ బైక్ ర్యాలీతో హోరెత్తిన అనకాపల్లి.. జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం
అనకాపల్లి, సెప్టెంబర్ 2: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అనకాపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ రావుగోపాలరావు కళాక్షేత్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని “జై జనసేన.. జై పవన్ కళ్యాణ్” నినాదాలతో అనకాపల్లిని హోరెత్తించారు.అనంతరం డాక్టర్ రావుగోపాలరావు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న నిబద్ధతను కొనియాడుతూ, విశాఖ రైల్వే జోన్, పోలవరం ఎడమ కాలువ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాల్లో ఆయన చొరవను ప్రస్తావించారు.అనంతరం పిఠాపురంలో జరిగిన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులు ఉత్సాహంగా నినాదాలు చేశారు.అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధిక జనసేన సభ్యత్వాలను నమోదు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను కొణతాల రామకృష్ణ ఘనంగా సత్కరించి అభినందించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత, అభిమానులతో వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.