అనకాపల్లి: దేశభక్తి, జాతీయ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచే 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అనకాపల్లి రింగ్ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు మహాత్మా గాంధీ, భగత్‌సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు తదితర ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.నేడు భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు సాగుతోందని, 2047 నాటికి వికసిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో దేశం పురోగమిస్తోందని అన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా నిలిచి దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మరోసారి ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.