హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యావకాశం పొందిన డాక్టర్ అద్దంకి దయాకర్కు బంజారా భారత్ తెలంగాణ అభినందనలు
🗞️ బిబి న్యూస్ | 14 Aug 2026
హైదరాబాద్: అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ కెన్నెడీ స్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించిన తెలంగాణ ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు డాక్టర్ అద్దంకి దయాకర్కు బంజారా భారత్ తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జగన్ నాయక్ విశ్లావత్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో ప్రొఫెసర్ మార్షల్ గ్యాంజ్ నేతృత్వంలో నిర్వహించే ‘లీడర్‌షిప్, స్టోరీటెల్లింగ్ అండ్ యాక్షన్’ అంశంపై ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులో డాక్టర్ అద్దంకి దయాకర్ పాల్గొననున్నారు. ఈ కోర్సు ఆగస్టు 31 నుంచి డిసెంబర్ 18, 2026 వరకు కొనసాగనుంది.వివిధ దేశాలు, విభిన్న రంగాలకు చెందిన నాయకులతో కలిసి నాయకత్వ సవాళ్లు, పబ్లిక్ పాలసీ, సమర్థవంతమైన నాయకత్వానికి అవసరమైన వ్యూహాలు తదితర అంశాలపై అధ్యయనం చేసే అవకాశం ఆయనకు లభించిందని డాక్టర్ జగన్ నాయక్ విశ్లావత్ తెలిపారు.సూర్యాపేట జిల్లా నిమ్మికల్ గ్రామానికి చెందిన సాధారణ గ్రామీణ కుటుంబం నుంచి ఎదిగి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి Ph.D., MCA, M.Com, LLB వంటి ఉన్నత విద్యార్హతలు సాధించిన డాక్టర్ అద్దంకి దయాకర్‌కు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ అవకాశం దక్కడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీ-జేఏసీలో చురుకైన పాత్ర పోషించి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన డాక్టర్ అద్దంకి దయాకర్ ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా, ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.హార్వర్డ్ యూనివర్సిటీలో పొందనున్న విద్య, శిక్షణ ద్వారా నాయకత్వ సామర్థ్యాలను మరింతగా పెంపొందించుకుని ప్రజాసేవలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు డాక్టర్ జగన్ నాయక్ విశ్లావత్ తెలిపారు.ఈ సందర్భంగా బంజారా భారత్ తెలంగాణ రాష్ట్రం తరఫున డాక్టర్ అద్దంకి దయాకర్‌కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.