శారదా నది పరిరక్షణపై ప్రజల ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సర్వేజన ఐక్యవేదిక డిమాండ్
🗞️ బిబి న్యూస్ | 27 Jul 2026
అనకాపల్లి: అనకాపల్లి పరిసర గ్రామాలకు సాగునీటి ప్రధాన ఆధారంగా నిలిచిన శారదా నది ప్రస్తుతం చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు మరియు ఇతర వ్యర్థాలతో కలుషితమవుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు అత్యంత కీలకమైన ఈ నదిని పరిరక్షించడంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శారదా నదిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే అభివృద్ధి చేయడం సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న శారదా నదిని పరిశుభ్రంగా, పరిరక్షిస్తూ కాపాడినా చాలనే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదిలో రోజురోజుకూ ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త పేరుకుపోవడం వల్ల నది కాలుష్యానికి గురవుతోందని పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా సర్వేజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోరిబిల్లి పరి మాట్లాడుతూ, కార్తీక మాసం సందర్భంగా శివాలయ పరిసర ప్రాంతాలు, నది తీరాన్ని శుభ్రపరిచినప్పటికీ అనంతరం తిరిగి పట్టించుకోవడం లేదని అన్నారు. దీంతో నదిలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి శారదా నది స్వచ్ఛత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.శారదా నది అనేక గ్రామాల రైతాంగానికి జీవనాధారమని, దీనిని పరిరక్షించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, వ్యర్థాలు వేయకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు.శారదా నదిని పరిరక్షించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నదిని అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.