అక్రమ ఇసుక, మైనింగ్ తవ్వకాలపై కఠిన చర్యలు ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్ల ఏర్పాటు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
🗞️ బిబి న్యూస్ | 20 Jul 2026
అనకాపల్లి, జూలై 19 (బీబీ న్యూస్): జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు, చట్టవిరుద్ధమైన మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని నదులు, వాగులు, వంకలు, ఇరిగేషన్ చెరువులను నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ ఇసుక తవ్వకాలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన అనుమతులు, అవసరమైన అధికారిక పత్రాలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే డి-సిల్టింగ్ (పూడికతీత) లేదా ఇసుక వెలికితీత పనులు నిర్వహించాలని సూచించారు.జిల్లాలో ఎక్కడైనా అక్రమ మైనింగ్ లేదా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే ప్రజలు వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని కోరారు. ఇందుకోసం ఏడీ మైన్స్ ప్రత్యేక హెల్ప్‌లైన్‌తో పాటు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
- 08924-225999
- 08924-226599
- 08924-222888
అక్రమ మైనింగ్ రహిత జిల్లాగా అనకాపల్లిని తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి, అక్రమ కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు.