ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలి: గని శెట్టి సత్యనారాయణ
🗞️ బిబి న్యూస్ | 18 Jul 2026
పరవాడ, జూలై 18: పరవాడ ఫార్మాసిటీలో వరుసగా జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలపై సమగ్ర విచారణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కార్మికులు "ఫార్మాసిటీలో ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలి", "కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి", "భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలి", "భద్రతా వైఫల్యాలకు బాధ్యులైన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి" అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, టోరెంటో పరిశ్రమలో నాణ్యతలేని చైన్ ఉపయోగించడం వల్ల చైన్ తెగి సల్ఫ్యూరిక్ యాసిడ్ కెమిస్ట్ ఎం. నాగరాజుపై పడి తీవ్ర గాయాలు అయ్యాయని ఆరోపించారు. అలాగే లోహిత్ ఫార్మాలో విష వాయువుల ప్రభావానికి గురైన వెంకటరమణమూర్తిని వెంటనే మెరుగైన వైద్యం కోసం తరలించి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేదని కాదన్నారు.లోహిత్ ఫార్మా యాజమాన్యం భద్రతా ప్రమాణాలను సరిగా పాటించడం లేదని, కార్మికులకు నాణ్యమైన మాస్కులు, హెల్మెట్లు, ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) కూడా తగిన విధంగా అందించడం లేదని ఆయన విమర్శించారు.దక్షిణ ఎనర్జీ సంస్థలో తగిన సిబ్బంది లేకుండా ఇద్దరు కార్మికులతో 24 గంటల పాటు పని చేయించడం వల్ల ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇటీవల శ్రీ సాయి చందన ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు సురక్షితంగా బయటపడినా, అది భారీ ప్రమాదానికి నిదర్శనమని అన్నారు.పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, అన్ని ఫార్మా పరిశ్రమల్లో వెంటనే భద్రతా ఆడిట్ నిర్వహించాలని, కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రమణ, చిన్నారావు, అప్పలరాజు, శేషు తదితరులు పాల్గొన్నారు.