రెవెన్యూ రికార్డులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి: జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
🗞️ బిబి న్యూస్ | 17 Jul 2026
అనకాపల్లి, జూలై 17: రెవెన్యూ రికార్డులు, భూ సర్వేలకు సంబంధించిన ప్రతి అంశంపై వీఆర్వోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు మండలం శ్రీరామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన తహసీల్దార్లు, వీఆర్వోల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.దేవరపల్లి, కె.కోటపాడు, మాడుగుల, చీడికాడ మండలాలకు చెందిన భూ సర్వే రికార్డులను పరిశీలించిన కలెక్టర్, సర్వే రిజిస్టర్లు, జమాబంది, అడంగల్ తదితర రెవెన్యూ రికార్డులపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి అవసరమైన సమాచారం అందించడంలో రెవెన్యూ వ్యవస్థ కీలకమని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందించాలంటే రికార్డులపై సంపూర్ణ అవగాహన తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.గ్రామాల్లో ప్రభుత్వ భూములు (పోరంబోకు), బంజరు భూములు, సాగుభూముల వివరాలపై వీఆర్వోలకు ఎప్పటికప్పుడు స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. వచ్చే వారంలో నిర్వహించే సమీక్షకు భూ సర్వేలకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, బ్రిటీష్ కాలం నాటి పాత రెవెన్యూ మాన్యువల్స్ స్థానంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చిందన్నారు. గతంలో ఉన్న వందలాది మాన్యువల్స్‌ను సరళీకరించి పరిపాలనను మరింత సులభతరం చేసినట్లు తెలిపారు.జమాబందిని గ్రామాల్లోనే నిర్వహించడం ద్వారా 1/1, ఎస్‌ఎల్‌ఆర్ వంటి రికార్డులను అక్కడికక్కడే సరిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇనాం చట్టాలు, గ్యాప్ ఏరియాలపై పూర్తి అవగాహన పెంచుకుని భూవివాదాలకు తావులేకుండా రికార్డులను క్రమబద్ధీకరించాలని సూచించారు. భూ రికార్డుల సంరక్షణ, అసైన్‌మెంట్ భూముల దుర్వినియోగాన్ని అరికట్టడం, జలవనరుల పరిరక్షణకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్‌ఐలు, వీఆర్వోలు తమ విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, డీఆర్ఓ వై. సత్యనారాయణరావు, అనకాపల్లి ఆర్డీవో ఆయేషా, తహసీల్దార్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.