📢 Advertisement Space

చక్రవర్తి పునర్నియామకంపై ప్రజా సంఘాల ఆందోళన అనకాపల్లికి మళ్లీ జోనల్ కమిషనర్‌గా రావడాన్ని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్

🗞️ బిబి న్యూస్ | 17 Jul 2026

అనకాపల్లి, జూలై 17: జీవీఎంసీ అనకాపల్లి జోన్‌కు కె. చక్రవర్తి మరోసారి జోనల్ కమిషనర్‌గా నియమితులవడం పట్ల ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఆయనపై ఉద్యోగులను మానసికంగా వేధించడం, మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అధిక పని ఒత్తిడి కల్పించడం వంటి ఆరోపణలపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయని, వాటిపై విచారణలు పూర్తికాకముందే తిరిగి అదే బాధ్యతలు అప్పగించడం పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నాయి.ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పటాన్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ శాఖ అధికారులను మున్సిపల్ శాఖలో డిప్యూటేషన్‌పై కొనసాగించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, కె. చక్రవర్తికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం వెనుక కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.అనకాపల్లి జోన్‌లో విధులు నిర్వహించిన వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి ఎం. నూకరాజు మరణం నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని,ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.అలాగే గతంలో నమోదైన ఉద్యోగుల ఫిర్యాదులు,మహిళా ఉద్యోగుల వేధింపుల ఆరోపణలు,పెండింగ్‌లో ఉన్న విచారణలను త్వరితగతిన పూర్తి చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.అనకాపల్లి సర్వజన ఐక్యసమితి వ్యవస్థాపకుడు కోరిబిల్లి పరి మాట్లాడుతూ, ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని మళ్లీ అదే స్థానంలో నియమించడం ప్రజల్లోనూ, ఉద్యోగుల్లోనూ ఆందోళన కలిగిస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న విచారణలను వెంటనే పూర్తి చేసి, అప్పటి వరకు కె.చక్రవర్తిని విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా సంఘాలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బాజీ పటాన్ తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 2026 ఆగస్టు 15 నుంచి అనకాపల్లి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే చొరవ తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మరియు కూటమి నాయకులు జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్‌కు తగిన ఆదేశాలు ఇచ్చి,కె.చక్రవర్తిపై ఉన్న ఆరోపణలు మరియు పెండింగ్ విచారణలను పరిగణనలోకి తీసుకుని ఆయనను విధుల నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ ఉన్నతాధికారులు ఈ అంశంపై వెంటనే స్పందించి ఉద్యోగులకు భయరహితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించాలని సంఘాల నాయకులు కోరారు. కె. చక్రవర్తి నియామకాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి తగిన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరించాయి.