అనకాపల్లికి ఆధునిక బస్ స్టాప్‌లు నిర్మించాలి – బీజేపీ నేతల వినతి
🗞️ బిబి న్యూస్ | 14 Jul 2026
జనతా వారధిలో వినతిపత్రం.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రస్తుత బస్ స్టాప్‌పై ఆందోళన
అనకాపల్లి, జూలై 14: జిల్లా హోదా వచ్చినప్పటికీ అనకాపల్లి మున్సిపాలిటీ పనితీరులో ఆశించిన మార్పులు కనిపించడం లేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు విమర్శించారు. ప్రజలకు సౌకర్యవంతమైన, ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన బస్ స్టాప్‌లు నిర్మించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన "జనతా వారధి" కార్యక్రమంలో భాగంగా వినతిపత్రాలు సమర్పించారు.బీజేపీ నాయకుడు దాడి వీరునాయుడు ఆధ్వర్యంలో, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుకు, జిల్లా కలెక్టర్‌కు PGRS ద్వారా, అలాగే అనకాపల్లి ఎంపీకి జనతా వారధి కార్యక్రమంలో వినతిపత్రాలు అందజేశారు.వినతిపత్రంలో గవరపాలెంలో 33 ఏళ్ల చరిత్ర కలిగిన బాలకృష్ణ బస్ స్టాప్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పూర్తిగా తొలగించి, పాదచారులు నడిచే మార్గం మరియు రహదారిపైకి వచ్చేలా నూతన బస్ స్టాప్ నిర్మించడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మించిన బస్ స్టాప్ ప్రజల అవసరాలకు అనుకూలంగా లేదని, పాత బస్ స్టాప్ ఉన్న ప్రదేశంలో గానీ లేదా మరింత అనువైన స్థలంలో గానీ విశాఖ నగరంలోని ఆధునిక బస్ స్టాప్‌ల తరహాలో విశాలమైన, సురక్షితమైన, అన్ని సౌకర్యాలతో కూడిన నూతన బస్ స్టాప్ నిర్మించాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, అనకాపల్లి ప్రస్తుతం గ్రేటర్ విశాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న నగరమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక బస్ స్టాప్ నిర్మాణం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మరియు అనకాపల్లి ఎంపీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తప్పకుండా పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, జనతా వారధి కన్వీనర్ గొర్ల రామునాయుడు, బీజేపీ నాయకుడు దాడి వీరునాయుడు, బీజేపీ నాయకులు ఈశ్వర ప్రసాద్, కె. చిన్నారావు, అప్పారావు, జిల్లా మరియు మండల బీజేపీ నాయకులు, బి.ఎల్.-2లు, కార్యకర్తలు పాల్గొన్నారు.