చీకట్లో అటల్ విగ్రహం.. కూటమి ప్రభుత్వంపై ప్రజా సంఘాల విమర్శలు
🗞️ బిబి న్యూస్ | 02 Jun 2026
అనకాపల్లి, జూన్ 3: అనకాపల్లి బైపాస్ రోడ్డులోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేసినప్పటికీ, అనంతరం దాని నిర్వహణను పూర్తిగా విస్మరించారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.విగ్రహం ఏర్పాటు చేసిన సమయంలో గొప్పగా ప్రచారం చేసిన నాయకులు, అధికారులు ఆ తర్వాత దాని అభివృద్ధి మరియు సంరక్షణపై దృష్టి సారించలేదని వారు విమర్శించారు. విగ్రహం పరిసరాల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో వెలుతురు కోసం ఒక విద్యుత్ దీపం కూడా ఏర్పాటు చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు."మొక్క నాటితే సరిపోదు, దానికి నీరు పోసి పెంచాలి" అన్నట్లుగా విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా దాని నిర్వహణ, పరిసరాల అభివృద్ధిపై కూడా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విగ్రహం చుట్టూ అందమైన గార్డెన్, పచ్చదనం, కూర్చునే సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతానికి మరింత ఆకర్షణ చేకూరుతుందని సూచించారు.భారత రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించి, భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన అటల్ బిహారీ వాజపేయి విగ్రహం నేడు చీకట్లో ఉండటం బాధాకరమని, ఇది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజా సంఘాలు విమర్శించాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి విగ్రహం పరిసరాల్లో విద్యుత్ దీపాలు, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అటల్ మహనీయుడికి తగిన గౌరవం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.