లక్ష్మీదేవిపేట రైల్వే బ్రిడ్జి సమస్య పై అనకాపల్లి ఎంపీ ఫోకస్
🗞️ బిబి న్యూస్ | 30 May 2026
అనకాపల్లి పట్టణంలో దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న లక్ష్మీదేవిపేట రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో తో సమావేశమై పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా లక్ష్మీదేవిపేటలోని లెవెల్ క్రాసింగ్ నెం.485 స్థానంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరాన్ని ఎంపీ సీఎం రమేష్ జీఎం దృష్టికి తీసుకెళ్లారు.ఈ ప్రాంతంలో రోజువారీగా వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, రైల్వే గేటు మూసివేతల కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు పలుమార్లు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రజల భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం లక్ష్మీదేవిపేట ROB నిర్మాణాన్ని అత్యధిక ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టాలని కోరారు.అదేవిధంగా అనకాపల్లి జిల్లా పరిధిలో చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు,నిర్మాణ పనులు ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం,ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన, రైల్వే కనెక్టివిటీ విస్తరణ,పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల వేగవంతమైన అమలు తదితర అంశాలను ఎంపీ జీఎం దృష్టికి తీసుకెళ్లారు.అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైల్వే సదుపాయాలు కల్పించాలని కోరారు.ఈ ప్రతిపాదనలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు.లక్ష్మీదేవిపేట ROBతో పాటు అనకాపల్లి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇతర రైల్వే అభివృద్ధి పనుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని రైల్వే సదుపాయాలు తీసుకురావడానికి నిరంతరం కృషి కొనసాగిస్తామాని ఎంపీ పేర్కొన్నారు.