📢 Advertisement Space

తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కాలేజీలకు ఎలా చేరుతున్నాయి? అనుమతి లేకుండా వరుస ఫోన్ కాల్స్‌పై ఆగ్రహం

🗞️ బిబి న్యూస్ | 29 May 2026

ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల అడ్మిషన్ల సీజన్ ప్రారంభం కాగానే తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు వివిధ ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి వరుసగా కాల్స్ రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక కాలేజీలో వివరాలు నమోదు చేయకపోయినా, అనేక కాలేజీల నుంచి ఫోన్ కాల్స్ రావడంపై తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు."మా ఫోన్ నెంబర్లు కాలేజీలకు ఎలా చేరుతున్నాయి? ఎవరు అందిస్తున్నారు?" అని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ముందు కుటుంబాలకు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా, పదేపదే ఫోన్ కాల్స్ చేసి అడ్మిషన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు.ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, తల్లిదండ్రుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ఇతర విద్యాసంస్థలకు చేరవేయడం గోప్యత హక్కుల ఉల్లంఘన కింద పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని వర్గాలు జిల్లా స్థాయి విద్యాశాఖ కార్యాలయాల నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా ఫోన్ నెంబర్ల లీకేజీ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.తల్లిదండ్రుల వ్యక్తిగత డేటా భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? విద్యాసంస్థలకు పదేపదే ఫోన్ చేసి వేధించే అధికారం ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.ఈ వ్యవహారంపై జిల్లా మరియు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించి, ఫోన్ నెంబర్ల సేకరణ, వినియోగంపై స్పష్టత ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి."విద్య పేరుతో వేధింపులు కాదు... తల్లిదండ్రుల గోప్యతకు రక్షణ కావాలి" అని ప్రజలు కోరుతున్నారు.