📢 Advertisement Space

స్థానిక బీసీ రిజర్వేషన్లపై కమిషన్‌కు వెంటనే వినతిపత్రాలు పంపాలి: సర్వేశ్వరరావు

🗞️ బిబి న్యూస్ | 12 May 2026

అనకాపల్లి, మే 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించే ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు బీసీ కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు సామాజిక బాధ్యులు తక్షణమే వినతిపత్రాలు సమర్పించాలని మాజీ బీసీ నాయకుడు కాండ్రేగుల సర్వేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ప్రత్యేక కమిషన్‌ను నియమించగా, ఈ కమిషన్ స్థానిక సంస్థల పరిధిలో బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి రిజర్వేషన్ శాతంపై నివేదిక సమర్పించాల్సి ఉందని తెలిసిందే. విశాఖపట్నంలో జరిగిన సమీక్ష సమావేశంలో కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, బీసీ వర్గాల సామాజిక-ఆర్థిక స్థితిగతులను సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా పరిశీలించి, స్థానిక పాలనా సంస్థల్లో ఇవ్వాల్సిన తగిన రిజర్వేషన్ శాతంపై నిర్ణయం తీసుకునేలా ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇదే నేపథ్యంలో బీసీ కుల సంఘాలు తమ తమ వర్గాల గణాంకాలు, పాత ప్రాతినిధ్య వివరాలు, సామాజిక-ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించిన అంశాలు చేర్చి వినతిపత్రాలు పంపించడం అత్యంత అవసరమని సర్వేశ్వరరావు తెలిపారు.అనకాపల్లి గౌరీ సేవాసంఘం (రిజి.) మరియు విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం (రిజి.)తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాల్లో ఉన్న రిజిస్టర్డ్ గౌరీ సేవాసంఘాల పెద్దలు, బాధ్యులు వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఆయా బీసీ కుల సంఘాల లెటర్‌ప్యాడ్‌పై కమిటీ పెద్దల సంతకాలతో వినతిపత్రాలు సిద్ధం చేసి, ఇమెయిల్ ద్వారా పంపడంతో పాటు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా హార్డ్ కాపీని విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పాత వినతిపత్రాల్లో వాడిన పరామితులతో పాటు తాజా గణాంకాలను జోడించడం మంచిదని, పంపిన పత్రాలకు సంబంధించిన అంగీకార రసీదులు, జిరాక్స్ ప్రతులు, పోస్టల్ ఆధారాలు తప్పనిసరిగా భద్రపరచుకోవాలని సర్వేశ్వరరావు సూచించారు. గతంలో పుట్టుస్వామి కమిషన్ నుంచి మంజునాథ్ కమిషన్ దాకా వచ్చిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, ఈసారి మరింత సమగ్రతతో స్పందించడం సామాజిక బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సమాచారం ఇంకా విస్తృతంగా అందరికీ తెలియలేదనే భావనతోనే తాను మాజీ బీసీ నాయకునిగా అందరికీ తెలియజేస్తున్నానని సర్వేశ్వరరావు పేర్కొన్నారు. గవర కులానికి సంబంధించిన వివరాలపై సందేహాలు ఉంటే గతంలో ఈ అంశాలపై పని చేసిన పరిజ్ఞానం గల నిపుణులను సంప్రదించి, సమగ్ర వినతిపత్రాలు సిద్ధం చేసి మే 15లోపు కమిషన్‌కు అందేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.